చిన్నశేష వాహనంపై గోవిందుని రాజసం
తిరుపతి మే 27,అనంత జనశక్తి న్యూస్
తిరుపతి గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో శనివారం ఉదయం
శ్రీ గోవిందరాజస్వామి చిన్నశేష వాహనంపై భక్తులను అనుగ్రహించారు. ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు వాహనసేవ జరిగింది. గజరాజులు ముందు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ స్వామివారి వాహనసేవ వైభవంగా జరిగింది. చిన్నశేష వాహనం స్వామివారి వ్యక్తరూపమైన పాంచభౌతికప్రకృతికి సంకేతం. కనుక ఈ వాహనం పంచభూతాత్మకమైన విశ్వానికి, అందునివసించే జీవునికి వరాలిస్తుంది. విశ్వం కన్పించే శ్రీవారి ప్రకృతి. విష్ణువు ఈ ప్రకృతికి ఆధారమై దాన్ని నడిపించేశక్తి. స్వామి విశ్వాన్ని రక్షించేవాడు కనుక శేషునిపై తానొక్కడే విహరించారు. ఐదు తలల చిన్నశేషుని దర్శనం మహాశ్రేయఃప్రదం. శేషవాహనోత్సవాన్ని దర్శిస్తే దుష్టశక్తుల వల్ల కలిగే దుష్ఫలాలు తొలగి, భక్తులు కుండలినీయోగ సిద్ధించి, సుఖశాంతులతో ఆనందజీవులతారు.
అనంతరం ఉదయం 9:30 నుండి 10:30 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారి ఉత్సవ ర్లకు స్నపన
తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో విశేషంగా అభిషేకం చేశారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించనున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, కంకణ భట్టర్ ఏపీ శ్రీనివాస దీక్షితులు,డిప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో రవి కుమార్, సూపరింటెండెంట్ నారాయణ, టెంపుల్ ఇన్స్‌పెక్టర్ రాధాకృష్ణ పాల్గొన్నారు.