రూ.17,144 కోట్ల పోల’వరం’ నిధుల విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
కేంద్ర మంత్రితో సీఎం జగన్ భేటీ ఎఫెక్ట్.. నిధుల విడుదలపై చర్యలు వేగవంతం
పోలవరం గడవు 2025కు పొడిగింపు.. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కీలక సూచన
న్యూఢిల్లీ జూన్ 02,అనంత జనశక్తి ప్రతినిధి
సీఎం జగన్ కేంద్ర మంత్రిని కలిసిన తర్వతే నిధులకు సంబంధించి నిర్ణయాలు వేగవంతమైయ్యాయి.. ఏపీ ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి*
సీఎం జగన్‌కు వరుస ఢిల్లీ పర్యటన కారణంగా ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్యలు వేగవంతం అవుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు రూ.17,144 కోట్ల నిధుల విడుదలకు జలశక్తి మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెల్లింపులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు జలవనరుల శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ సి.నారాయణ రెడ్డి తెలిపారు.పోలవరం ప్రాజెక్టుపై భౌతిక, ఆర్థిక పురోగతిపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సమీక్ష నిర్వహించింది. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ అధ్యక్షతన ఢిల్లీలోని శ్రమ్ శక్తి భవన్‌లో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చర్చించేందుకు ఆరు అంశాలతో అజెండా రూపొందించారు. సవరించిన అంచనాలు, పునరావాసం, నష్టపరిహారంపై ఈ సమావేశం ప్రధానంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ సహ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అడహాక్ నిధుల కింద రూ. 17,414 కోట్ల విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి పరిశీలిస్తామని జలశక్తి మంత్రిత్వశాఖ తెలిపింది. ఇటీవల సీఎం జగన్ – జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌ను కలిసిన తర్వాతే నిధులకు సంబంధించిన నిర్ణయాలు వేగవంతమయ్యాయని ఏపీ ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి తెలిపారు.
తొలి దశ పూర్తికి రూ.17,144 కోట్లు
ప్రాజెక్టును 45.72 మీటర్ల వరకు పూర్తి చేసి, తొలి దశలో 41.15 మీటర్ల వరకు నీటిని నిల్వ చేసి.. ఆయకట్టుకు నీరిచ్చేలా పనులు పూర్తి చేయాలంటే రూ.17,144 కోట్లు అవసరమని జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్సీ నారాయణరెడ్డి వివరించారు. సమగ్రంగా 45.72 మీటర్ల స్థాయికి పూర్తి చేయడానికి 2017–18 ధరల ప్రకారం రూ.55,548.87 కోట్లు వ్యయం అవుతుందని సీడబ్ల్యూసీ తేల్చిందని, ఆ మేరకు నిధులివ్వాలని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి షెకావత్ స్పందిస్తూ.. తొలి దశ పూర్తికి రాష్ట్ర అధికారులు పంపిన ప్రతిపాదనను పరిశీలించి, నిధులు ఎంత అవసరమో నివేదిక ఇవ్వాలని పీపీఏ, సీడబ్ల్యూసీ అధికారులను ఆదేశించారు.ఆ నివేదికను కేంద్ర మంత్రి మండలి ఆమోదం తీసుకోవడం ద్వారా పోలవరానికి నిధుల సమస్య లేకుండా చేస్తామని, తద్వారా షెడ్యూలులోపు ప్రాజెక్టును పూర్తి చేయడానికి సహకరిస్తామని చెప్పారు. బ్యాక్ వాటర్ ప్రభావం వల్ల ముంపు సమస్యపై సంయుక్త అధ్యయనానికి ఒడిశా సహాయ నిరాకరణ చేయడంపై తాము చర్చిస్తామని మంత్రి షెకావత్ చెప్పారు.
*2025 నాటికి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి*
పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు 2025 జూన్ ను తాజా గడువుగా నిర్ణయించినట్లు ఇంజనీర్ ఇన్ ఛీఫ్ నారాయణరెడ్డి వెల్లడించారు. అయితే ఏడాది ముందుగానే ప్రాజెక్టు పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.
*పోలవరంపై ఎంపీ జీవీఎల్ కీలక ప్రకటన
పోలవరం ప్రాజెక్టుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక ప్రకటనలు చేశారు. త్వరలో రూ. 12వేల కోట్లకుపైగా నిధులు పోలవరం కోసం ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. దీని వల్ల 41.15 ఎత్తులో నీటి నిల్వ చేసుకునేందుకు అవసరమైన నిధులను ఇవ్వనుందని, తొలిదశ పోలవరం నిర్మాణం, ఢయాఫ్రం వాల్ మరమ్మత్తుల నిమిత్తం రూ. 12,911 కోట్లను కేంద్రం ఇస్తుందన్నారు. దీనిపై త్వరలో కేంద్ర కెబినెట్లో నిర్ణయం తీసుకోబోతోందన్నారు.