ఢిల్లీ లిక్కర్ స్కాం తర్వాత చత్తీస్ ఘడ్‌లో లిక్కర్ స్కాం జరిగిందని ఈడీ కేసులు పెడుతోంది. చత్తీస్ ఘడ్‌లో లిక్కర్ పాలసీ దాదాపుగా ఏపీ పాలసీలానే ఉంది. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో మద్యం వ్యాపారం మొత్తం ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది. అక్కడ ప్రైవేటు వ్యాపారులకు తావు లేదు. మొత్తం 800 లిక్కర్ షాపుల ద్వారా సర్కారే రోజు మద్యం విక్రయిస్తుంది.చత్తీడ్ గఢ్ స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ ఆధ్వరంలో మొత్తం తంతు నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలకు దగ్గర వ్యక్తి అయిన అన్వర్ అనే వ్యక్తి పూర్తిగా చక్రం తిప్పడం ప్రారంభించాడు. అన్ని విభాగాల్లో అతని అనచురులు దూరిపోయి ప్రైవేటు డిస్టిలరీల్లో మద్యం సేకరణ నుంచి… లైసెన్సులు, ఎక్సైజ్ శాఖ అధికారులు, సీసాల తయారీదారులు, నగదు వసూలు శాఖల వరకు అన్ని చోట్ల కమిషన్లకు తెరతీశాడు. మద్యం సేకరణ సమయంలోనే ప్రైవేటు లిక్కర్ వ్యాపారుల నుంచి కేసుకు రూ.150 వరకు కమిషన్ పొందినట్లు ఈడీ చెబుతోంది. అన్వర్ స్వయంగా మద్యం తయారు చేయించి.. ప్రభుత్వ లెక్కల్లో చూపించకుండా ప్రభుత్వ మద్యం షాపుల్లో విక్రయించాడు. నగదు రూపంలోనే విక్రయాలు జరపడం ద్వారా అవి ప్రభుత్వ రికార్డుల్లోకి వెళ్లకుండా చూసుకున్నాడు. 2019 నుంచి 2022 మధ్య ఇలాంటి అక్రమ సారా వ్యాపారం రాష్ట్రంలోని మొత్తం మద్యం విక్రయాల్లో 40 శాతం వరకు ఉంటుందని ఈడీ గుర్తించింది. అటు ఢిల్లీ.. ఇటు చత్తీస్ ఘడ్ స్కాంలను చూసిన తర్వాత ఏపీ లిక్కర్ పాలసీ గురించి ఎవరైనా తెలుసుకుంటే.. ముందు అసలు చరిత్రలో కనీ వినీ ఎరుగని స్కాం ఇక్కడ జరిగి ఉంటుంది కదా అన్న అభిప్రాయం ఎవరికైనా వస్తుంది. ఎందుకంటే.. మద్యం వ్యాపారం మొత్తం ప్రభుత్వ పెద్దల గుప్పిట్లో ఉంది. అమ్మేది ప్రభుత్వం పేరు మీద. కానీ అందులో మనుషులు దగ్గర్నుంచి లిక్కర్ బ్రాండ్లు, రవాణా సహా మొత్తం అయిన వాళ్ల గుప్పిట్లోనే ఉంది. పైగా అంతా పూర్తిగా నగదు లావాదేవీలు. ఎన్ని వేల కోట్లు వెనకేశారో చెప్పడం కష్టం. మరి ఈడీ ఎందుకు పట్టించుకోవడం లేదో వారికే తెలియాలి.