చక్రస్నానానికి ఏర్పాట్లు పూర్తి
– పుష్కరిణిలో రోజంతా పవిత్రత
– జేఈవో శ్రీ వీరబ్రహ్మం
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన అక్టోబరు 23న చక్రస్నానానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం తెలిపారు. ఆదివారం బ్రహ్మోత్సవం సెల్‌లో జేఈవో అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్బంగా జేఈవో మాట్లాడుతూ, ఉదయం 6 నుండి 9 గంటల వరకు శ్రీ వరాహస్వామివారి ఆలయం వద్ద గల స్వామి పుష్కరిణిలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, శ్రీ చక్రత్తాళ్వార్‌కు స్నపన తిరుమంజనం, ఆ తరువాత చక్రస్నానం నిర్వహిస్తారన్నారు. ఇందుకోసం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పుష్కరిణిలో గ్యాలరీలు, స్నానఘట్టాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.భద్రతాపరంగా ఇబ్బందులు లేకుండా టీటీడీ భద్రతా సిబ్బందితో పాటు ఎన్‌డిఆర్ఎఫ్, ఎస్‌డిఆర్ఎఫ్ సిబ్బంది, ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చక్రస్నానం పవిత్రత రోజంతా ఉంటుందని, భక్తులు సంయమనం పాటించి పుష్కరిణిలో స్నానం చేయాలన్నారు