ఆర్టీసీలో దొంగలు పడ్డారు....
-స్త్రీ శక్తి పథకంతో కిక్కిరిసిన ఆర్టీసీలు.
-స్త్రీల బంగారు నగలపై దొంగల దృష్టి.
-యదేచ్చగా ఆర్టీసీలో సెల్ ఫోన్లు, బంగారు నగల దోపిడీ.
-బస్సులు ఫుల్... అధికారుల పర్యవేక్షణ నిల్.
-ఆర్టీసీలో వినపడని అనౌన్స్మెంట్లు.... గ్రామీణ ప్రయాణికులకు ఇబ్బందులు.
-డ్రైవర్ల... కండక్టర్ల కష్టాలు దేవుని ఎరుక.
-దొంగతనాల పట్ల అవగాహన కల్పించడంలో డిఎం విఫలం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకం తో ఆర్టిసి లో మహిళా ప్రయాణికుల తో కిక్కిరిసిపోతోంది. పండగలకు పబ్బాలకు సెలవుల దినాలలో దాదాపు ప్రతి బస్సులో 80% మహిళలు 20 శాతం పురుషులు ప్రయాణిస్తున్నారు. దాంతో దొంగలు ఆర్టీసీ పై దృష్టి కేంద్రీకరించి యదేచ్చగా సెల్ఫోన్లు, బంగారు నగలు దోపిడీ చేయుచున్నారు. మహిళా ప్రయాణికులు సీట్లపై దృష్టి కేంద్రీకరించడంతో దొంగలు మహిళలపై ఉన్న నగలపై దృష్టి పెట్టి సులభంగా దొంగతనాలు చేయుచున్నారు. గతంలో ధర్మవరం ఆర్టీసీ దొంగతనాలకు అడ్డాగా చేసుకొని సెల్ ఫోన్లు ఇతర సామాగ్రి దోచుకున్న సందర్భాలు అనేకం. ఇప్పుడు అధిక ప్రయాణికులతో దొంగలు మహిళా ప్రయాణికులు నగలపై దృష్టి పెట్టి సులభంగా దోచేస్తున్నారు. కానీ వీటిపై ఆర్టీసీ డిపో మేనేజర్ నుంచి అధికారుల వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంలో ఏమి ఆంతర్యం ఉందో అర్థం కావడం లేదు. దొంగతనాలు జరిగిన ప్రతి సందర్భంలో అనేకసార్లు విన్నవించిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం దొంగతనాలు జరిగిన సందర్భంలోనైనా ఆర్టీసీ డిపో మేనేజర్ నుంచి అధికారుల వరకు చెల్లించకపోవడం అత్యంత దారుణం. పోలీసుల కైనా సమాచారం అందించి బాధితుల పక్షాన నిలవకపోవడం వారి అసమర్ధకు నిదర్శనం. కనీసం అనౌన్స్మెంట్ లోనైనా దొంగలున్నారు జాగ్రత్త? అనే చెప్పే నాథులు కరువయ్యారని ప్రజలు వాపోతున్నారు.
శ్రీసత్యసాయిజిల్లాప్రతినిధి, అక్టోబర్ 8, అనంత జనశక్తి న్యూస్:
మహిళా మెడలో గొలుసు చోరీ:
సికేపల్లి మండలం గంగినేపల్లి తండాకు చెందిన జమున బాయి. ఈమె బుధవారం అనంతపురంలో బస్సు ఎక్కి ధర్మవరం బస్టాండ్ లో దిగుతుండగా జనం రద్దీని ఆసరాగా చేసుకున్న దొంగలు ఆమె మెడలోని మూడున్నర తులం తాళిబొట్టు చైన్ దొంగలించారు. ప్లాట్ ఫామ్ లోకి వచ్చిన తర్వాత మెడ పైన చూసుకుంటే చైన్ లేదు. సుమారు రూ.4.5 లక్షల విలువైన తాళిబొట్టుతో సహా చైన్ దొంగలు కాజేయడంతో ఆ పేద మహిళ పిలిపిస్తున్న తీరు పలువురిని కలిచివేసింది.ధర్మవరం ఆర్టీసీ డిపోలో టీటీగా పనిచేస్తున్న ఉద్యోగి బస్టాండ్ లో జనం రద్దీగా ఉండటం వల్ల అక్కడికి చేరుకొని తగ్గించడానికి ప్రయత్నిస్తుండగా పైన జేబులో పెట్టుకున్న సెల్ ఫోన్ కళ్ళముందే దొంగలు లాక్కెళ్లారు. దొంగతనం నుంచి తెరుకున్న ఆ ఉద్యోగి దొంగను పట్టుకోవడానికి ప్రయత్నించగా అప్పటికే కనిపించకుండా పారిపోయాడు. దొంగతనం గురించి ఎవరికి చెప్పుకోలేక వదిలేసే పరిస్థితి ఏర్పడింది. దాదాపురూ. 30000 రూపాయలు పైగా విలువైన ఆ సెల్ఫోన్ పోగొట్టుకోవాల్సిన అగత్యం ఏర్పడింది.
దొంగలు బాబోయ్ దొంగలు.....
ఇలా ధర్మవరం బస్టాండ్ ప్రతిరోజు నిత్యం దొంగతనాలకు నిలయంగా మారింది. ఇంత జరుగుతున్న డిపో మేనేజర్ కానీ ఇతర అధికారులు కానీ వాటి నియంత్రణకు చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. రోజు రెండు నుంచి ఐదు వరకు దొంగతనాలు జరుగుతున్నట్లు ఆర్టీసీ కార్మికులే పేర్కొనడం గమనార్హం. వరుస దొంగతనాలు జరుగుతుండడంతో అటు ప్రయాణికులు ఇటు ఆర్టీసీ కార్మికులు సిబ్బంది సైతం బెంబేలెత్తిపోయే పరిస్థితి ధర్మవరం ఆర్టీసీలో ఏర్పడుతోంది. ఆగస్టు 15న ఉచిత మహిళ ప్రయాణం పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు రూ. 52 లక్షల విలువైన నగదు, సెల్ ఫోన్లు బంగారం ప్రయాణికుల నుంచి దొంగలు సునాయసంగా తస్కరించినట్లు ప్రయాణికుల ద్వారా తెలుస్తోంది. దీంతో ధర్మవరం బస్టాండ్ బస్సు ఎక్కాలంటేనే ప్రయాణికుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది.
నిర్లక్ష్యానికి నిలువుటద్దం ఆర్టీసీ అధికారులు....
ధర్మవరం ఆర్టీసీ బస్టాండ్లో నిత్యం దొంగతనాలతో పాటు, నిత్యం ఏదో ఒక సంఘటన జరుగుతున్న వాటిని అరికట్టడంలో ఉన్నతాధికారి పూర్తిగా విఫలమయ్యారన్న విమర్శలు ప్రయాణికుల ద్వారా వ్యక్తం అవుతుది. పర్యవేక్షణ పూర్తిగా కొరబడడం వల్లనే దొంగలు మరింత రెచ్చిపోతున్నారన్న విమర్శలు బహిరంగంగా వ్యక్తమవుతోంది. సత్యసాయి జిల్లాలో ధర్మవరం, హిందూపురం, కదిరి బస్టాండులలో విపరీతంగా ప్రయాణికుల రద్దీ ఉంటుంది. ఇందులో ధర్మవరం బస్టాండ్ లో ప్రయాణికుల రద్దీ అంతా ఇంత కాదు. ఏ బస్సు వచ్చిన విపరీతంగా ఎక్కుతుండడంతో అదే అదునుగా భావిస్తున్న దొంగలు తమ పని తాము సులువుగా కానిచ్చుకుపోతున్నారు.
అవగాహన కల్పించడంలో డిపో మేనేజర్ విఫలం...
ధర్మవరం ఆర్టీసీ బస్టాండులో దొంగల బెడద ఎక్కువగా ఉన్నట్లు ఫిర్యాదులు వస్తున్న డిపో మేనేజర్ లో మాత్రం కనీసం చలనం లేకపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. డిపోలో బస్సుల రాకపోకలు తెలపడంలో గాని బస్సులు వచ్చినప్పుడు అనౌన్స్మెంట్ చేయడంలో గాని పూర్తిగా విఫలమయ్యారు అనే భావన ప్రయాణికుల్లో నెలకొంది. బస్సులో రాకపోకలను తెలియజేయడానికి ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగులను ఏర్పాటు చేసినప్పటికీ వారు కూడా అలస్వత్వం ప్రదర్శిస్తుండడంతో ప్రయాణికులకు నరకకూ పంగా మారింది. వరుస దొంగతనాలతో ప్రయాణికులు బెంబేలెత్తుతున్న దొంగలున్నారు... జాగ్రత్త... అని మైక్ లో చెప్పడానికి కూడా ఆర్టీసీ సిబ్బందికి నోరు రాకపోవడం చూస్తుంటే ఆర్టీసీ డిపో మేనేజర్ పర్యవేక్షణ ఏమాత్రం ఉందో చెప్పకనే తెలుస్తోంది.
దృష్టి కేంద్రీకరించకపోవడంతో రెచ్చిపోతున్న దొంగల గ్యాంగ్...
ధర్మవరం ఆర్టీసీ బస్టాండ్ దొంగతనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న ఉన్నతాధికారి మాత్రం బెల్లం కొట్టిన రాయిలా వ్యవహరిస్తుండడం ప్రయాణికులకు శాపంగా మారుతుండగా దొంగలు మాత్రం అవలీలగా ఎటువంటి ఇబ్బంది లేకుండా తమ పని తాము సునాయసంగా కానీచ్చుకుపోతున్నారు. బుధవారం ఓ పేద మహిళ మెడలో ఉన్న బంగారాన్ని దొంగలు దొంగలించడం తెలుసుకున్న అవున్నతాధికారి తగిన చర్యలు తీసుకోకపోగా దొంగ చాటుగా కారు ఎక్కి వెళ్లిపోవడం ప్రయాణికుల్లోను మరియు ఆర్టీసీ కార్మికులు సైతం నివ్వెర పోయే పరిస్థితి ఏర్పడింది. సొమ్ము పోగొట్టుకున్న మహిళకు అండగా నిలిచి అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు చేయించాల్సింది పోయి తమకేమొచ్చిన గొడవలే అంటూ అక్కడ నుంచి జారుకోవడం చూస్తుంటే ఆ అధికారి బాధ్యత స్థాయిలో ఉందో చెప్పగానే తెలుస్తోంది.
స్త్రీ శక్తి పథకం పెట్టారు కానీ.. తగ్గ బస్సులేవీ....
ధర్మవరం డిపో కి బస్సుల సంఖ్య భారీగా తగ్గడం ఏ పరిస్థితుల్లో ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల మహిళా ప్రయాణికుల సంఖ్య గతం కంటే నాలుగింతలు పైగా పెరిగింది. ధర్మవరం డిపోలో దాదాపు 65 బస్సులు తిరుగుతుండగా వీటి సరాసరి 4 నుంచి 6 సింగిల్స్ అవకాశం ఉంటుంది. ఈ లెక్కన గరిష్టంగా ప్రతిరోజు 2000 నుంచి 2500 మందిని గమ్యానికి చేర్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ధర్మవరం బస్టాండ్ నుంచి ప్రతి రోజు 6000 మంది పైగా ప్రయాణిస్తున్నట్లు కార్మిక సంఘాల ద్వారా తెలుస్తోంది. ఇందుకు తగ్గట్టు బస్సులు ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం వల్ల బస్సులోనే ప్రయాణికులు కిక్కిరిసి వెళ్లడం వల్ల బస్సులో సీట్ల విషయంలో ప్రయాణికులు సిగపట్లు పట్టే పరిస్థితి నిత్యం ఏదో ఒక ప్రాంతంలో జరుగుతూనే ఉంది. బస్సుల సంఖ్య పెంచకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు తలెత్తక మానదన్న విమర్శలు కూడా లేకపోలేదు.
ఆదాయానికి ముందు... కనీస అవసరాలకు వెనుక...
ధర్మవరం బస్టాండులో కనీస అవసరాలు కల్పించడంలో కూడా ఉన్నతాధికారి పూర్తి విఫలమయ్యారు. టీ స్టాల్ ల వద్ద విపరీతంగా బైకులు పార్కింగ్ చేయడంతో బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఇది అదునగా భావిస్తున్న పుట్టపర్తి డిపో బస్సులు రాత్రి 7:00 దాటితే బస్టాండ్ లోకి రాకుండా నేరుగా అనంతపురం వెళ్లే పరిస్థితి నెలకొంటుంది. అదేవిధంగా రాత్రి 8:00 దాటితే అటు ఫ్యాన్లు, ఇటు లైట్లు తోపాటు మరుగుదొడ్లు బంద్ చేయడం వల్ల ప్రయాణికులు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతుండగా మరికొందరి మహిళలు మరుగుదొడ్లకు వెళ్లాలంటే వారు పడుతున్న బాధలు వర్ణనాతీతం. ఈ విషయంపై నేరుగా కొందరు డిపో మేనేజర్ కు ఫిర్యాదు చేసిన ఆయనలో చలనం లేకపోవడం పలువురిని ఆందోళనకు గురిచేస్తుంది.
డ్రైవర్ల, కండక్టర్ల కష్టాలు దేవుని కెరుక:
కె .బి నాగార్జున రెడ్డి, ఆర్టీసీ రాష్ట్ర కార్యదర్శి.
స్త్రీ శక్తి పథకం మహిళలకు ఒక వరం. అది మేము ఆహ్వానిస్తున్నాం. అందరూ సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నాం. మహిళా ప్రయాణికులు జిల్లాల్లో ఎక్కువగా ఉండడం, బస్సుల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ఇబ్బంది పడుతున్నాం. వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం గానీ అధికారులు గానీ బస్సుల సంఖ్య పెంచుతూ... ఈ పథకాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని కోరుతున్నాం. అదేవిధంగా బస్టాండ్లో బస్సు పాయింట్లు ఉండగా అధిక రద్దీతో దొంగతనాలు జరుగుతున్నాయి. నిఘా కేంద్రాలు లేవు. తద్వారా మహిళలు ఇబ్బంది పడుతున్నారు. మహిళా ప్రయాణికులు డ్రైవర్లను కండక్టర్లను సహకరించక పోవడం బాధాకరం. బస్సు లోనికి వెళ్ళమంటే వాదనకు దిగుతున్నారు. ఆత్మ రక్షణ కరువైంది. డ్రైవర్ల పై కండక్టర్లపై చేయి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మహిళా ప్రయాణికులు డ్రైవర్లను కండక్టర్లను సహకరిస్తే ఈ పథకం మరింత అభివృద్ధి చెందుతుంది.