Logo
Date of Publish : 21 October 2025, 5:16 am
Editor : Shankaragallu Venkatesulu

పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి

పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి

- ఘననివాళి అర్పించిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

శ్రీకాకుళం

ప్రజారక్షణ విధుల్లో ప్రాణాలను సైతం పణంగా పెట్టి శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్న పోలీసుల త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రారంభంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన మంత్రి, అనంతరం అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ఘన నివాళులర్పించారు. పోలీసు వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తేనే ప్రజలు సంతోషంగా జీవిస్తారని ఆయన అన్నారు. విధి నిర్వర్తనలో ప్రాణాలు అర్పించిన పోలీసుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులు, మానప్రాణాల రక్షణలో పోలీసులు చూపిస్తున్న అంకితభావం అభినందనీయమని పేర్కొన్నారు. సరిహద్దులో దేశాన్ని కాపాడే సైనికులు ఒక ఎత్తైతే, దేశంలో ప్రజల భద్రతను కాపాడే పోలీసులు మరో ఎత్తు అని వ్యాఖ్యానించిన మంత్రి అచ్చెన్నాయుడు, పోలీసుల ధైర్యం, త్యాగం దేశానికి గర్వకారణమని అన్నారు. పోలీసు అమరవీరుల కుటుంబసభ్యులతో మాట్లాడుతూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న మంత్రి, వారి త్యాగం ఎప్పటికీ మరువలేనిదని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల శాంతి కోసం పోలీసులు అహర్నిశలు కృషి చేస్తున్నారని, వారి సేవలు ప్రజాస్వామ్య బలానికి పునాది అని పేర్కొన్నారు. మన రాష్ట్ర పోలీసు వ్యవస్థ పనితీరుపై గర్వపడుతున్నానని తెలిపారు. నక్సలిజం అరికట్టడంలో, గంజాయి మరియు మాదకద్రవ్యాల రవాణాను నియంత్రించడంలో పోలీసుల పాత్ర ప్రశంసనీయమని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో గంజాయి, మాదకద్రవ్యాల రవాణా విచ్చలవిడిగా జరిగిందని విమర్శించారు. మాదక ద్రవ్యాల వాడకం వలనే మహిళలపై అఘాయిత్యాలు, అపహరణలు, రోడ్డు ప్రమాదాల వంటివి జరుగుతున్నాయని , వీటిని అరికట్టడంలో ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసు అధికారులను సూచించారు. సైబర్ క్రైమ్‌పై ప్రజల్లో అవగాహన పెంచుతూ, టెక్నాలజీ సాయంతో నేరస్తులను పట్టుకోవాలన్నారు. ఏ ప్రగతి జరగాలన్నా పోలీసులే కీలకం. రాత్రింబవళ్లు కష్టపడే పోలీసు సిబ్బందికి నా మనఃపూర్వక అభినందనలు అని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)