శివనామస్మరణతో మారుమోగుతున్న ఆలయాలు
తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు
అనంతజనశక్తి న్యూస్, ఏపీ & టీఎస్ స్పెషల్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. శివాలయాలు, నదీతీరాలు భక్తులతో నిండిపోయాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు, దీపారాధనలు, దానధర్మాలతో మునిగిపోయారు. ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించి, అరటి తొక్కలతో చేసిన దీపాలను నదులలో వదులుతూ పుణ్యం సంపాదించారు.
నంద్యాల
శ్రీశైలంలో మల్లన్న దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి, అమ్మవారి దర్శనార్థం క్యూలైన్లలో బారులు తీరారు. సాధారణ దర్శనానికి సుమారు 4 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. ఆలయ ప్రాంగణం “హర హర మహాదేవ” నినాదాలతో మారుమోగింది.
వరంగల్
కార్తీక పౌర్ణమి సందర్భంగా వరంగల్ వేయిస్తంబాల దేవాలయం, కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం, రామప్ప దేవాలయం, కురవి వీరభద్రస్వామి, పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు దీపాలు వెలిగించి అభిషేకాలు చేశారు. ఆలయాలు దీపాలతో మెరిసిపోయాయి.
నల్లగొండ
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలు భక్తులతో నిండిపోయాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాల వద్ద దీపారాధనలతో భక్తి వాతావరణం నెలకొంది. “శివాయ నమః” జపాలతో ఆలయాలు మారుమోగాయి.
మెదక్ – సంగారెడ్డి
బొంతపల్లి వీరభద్రస్వామి, బీరంగూడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి, ఝారాసంగం కేతకి సంగమేశ్వర, సంగారెడ్డి సోమేశ్వర ఆలయాల్లో భక్తులు బారులు తీరారు. ప్రత్యేక పూజలు, దీపారాధనలతో వేడుకలు వైభవంగా సాగాయి.
భద్రాద్రి కొత్తగూడెం
భద్రాచలం వద్ద గోదావరి తీరంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు. మణుగూరు సబ్‌డివిజన్ వ్యాప్తంగా కూడా ఆలయాలు భక్తులతో నిండిపోయాయి. “ఓం నమః శివాయ” నినాదాలతో వాతావరణం ఆధ్యాత్మికంగా మారింది.