ప్రధాని పర్యటన దృశ్య రాష్ట్ర మంత్రులు అధికారులతో సమీక్ష సమావేశం.
-పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల సన్నాహాలపై రాష్ట్ర మంత్రుల బృందం సమీక్ష
-ప్రధానమంత్రి పర్యటన దృష్ట్యా పుట్టపర్తిలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలు
-ప్రధానమంత్రి పర్యటనకు ముందస్తు సన్నాహాలు – మంత్రి సమీక్షలో కీలక నిర్ణయాలు
-భక్తుల సౌకర్యం ప్రభుత్వ ప్రాధాన్యత – మంత్రి
-వైద్య అత్యవసర పరిస్థితులపై మొబైల్ మెడికల్ యూనిట్లు సిద్ధంగా ఉంచాలి
– మంత్రి సత్యకుమార్ యాదవ్
శ్రీ సత్యసాయి జిల్లా ప్రతినిధి, నవంబర్ 11, అనంత జనశక్తి న్యూస్:
పుట్టపర్తిలో జరగనున్న శ్రీ సత్య సాయి బాబా శతజయంతి ఉత్సవాల ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం... రాష్ట్ర రెవెన్యూ మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ, దేవాదాయశాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి లు మంగళవారం స్థానిక సాయి ఆరామంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా అధికారులు, శ్రీ సత్య సాయి ట్రస్ట్ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉత్సవాలకు సంబంధించిన సన్నాహాలు, భద్రతా ఏర్పాట్లు, వసతి, రవాణా, వైద్య సేవలు మరియు ప్రజా సౌకర్యాలపై విస్తృతంగా చర్చించారు.సమావేశంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ... భగవాన్ శ్రీ సత్య సాయి బాబా 100వ జయంతి వేడుకలు అంతర్జాతీయ స్థాయిలో జరుగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి, ప్రధానమంత్రి పర్యటనకు తగిన విధంగా ప్రతి అంశం పకడ్బందీగా అమలవ్వాలి అని సూచించారు. ప్రత్యేకంగా ఆరోగ్య శాఖ ఏర్పాట్లపై మంత్రి సమీక్షించారు. ఆయన జిల్లా వైద్యాధికారులు, సూపరింటెండెంట్‌లు మరియు వైద్య సిబ్బందితో మాట్లాడి.. వేడుకలకు విచ్చేసే భక్తులు, ప్రముఖులు, వృద్ధులు, మహిళలు, పిల్లలకు తగిన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండాలన్నారు. పుట్టపర్తి ప్రాంతంలోని ప్రధాన రహదారులు, వసతి కేంద్రాలు, పలు ముఖ్యమైన పరిసర ప్రాంతాల్లో 24 గంటల అంబులెన్స్ సేవలు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌లు, మరియు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, సమీప ఆసుపత్రులు, ముఖ్యంగా శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ప్రభుత్వ ఆసుపత్రి, మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిరంతర విధుల్లో ఉండాలని, భద్రతా కారణాల దృష్ట్యా ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు ప్రతి విభాగంలో ఏర్పాటు చేసి వైద్య సిబ్బంది నిరంతర పహరాలు నిర్వహించాలని ఆదేశించారు. అలాగే ప్రధానమంత్రి విచ్చేసే సందర్భంలో ఎటువంటి వైద్య అత్యవసర పరిస్థితులు తలెత్తినా తక్షణ స్పందన ఇవ్వగల మొబైల్ మెడికల్ యూనిట్లు సిద్ధంగా ఉంచాలి. భక్తుల సంఖ్య అధికంగా ఉండే కారణంగా పర్యావరణ పరిశుభ్రత, తాగునీరు, శానిటేషన్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో... డిఐజి షిమోషి భాజ్పై, ఎంపీ బీకే పార్థసారథి, ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఆర్డీవోలు సువర్ణ, వివిఎస్ శర్మ, మహేష్, జిల్లా అధికారులు, ట్రస్టు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.