Logo
Date of Publish : 11 July 2026, 5:31 am
Editor : Shankaragallu Venkatesulu

పవన్ కళ్యాణ్‌కు విజయవంతంగా శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్‌కు విజయవంతంగా శస్త్ర చికిత్స

– కుడి భుజానికి మూడున్నర గంటలపాటు ఆపరేషన్

– రెండు భుజాల్లో తీవ్ర రొటేటర్ కఫ్ గాయాలు

– మరో రెండు నెలల్లో ఎడమ భుజానికి శస్త్ర చికిత్స

ముంబయి, జూలై 11:అనంత జనశక్తి న్యూస్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు శనివారం ఉదయం ముంబయిలో విజయవంతంగా శస్త్ర చికిత్స జరిగింది. రెండు భుజాల్లో తీవ్ర స్థాయిలో రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఉన్నట్లు ఇటీవల నిర్వహించిన వైద్య పరీక్షల్లో తేలడంతో వైద్యులు తక్షణ శస్త్ర చికిత్స అవసరమని సూచించారు.అయితే ఇప్పటికే నిర్ణయించిన అధికారిక కార్యక్రమాలను పూర్తి చేసిన అనంతరం శస్త్ర చికిత్స చేయించుకోవాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. వైద్యుల సూచన మేరకు రెండు భుజాలకు ఒకేసారి ఆపరేషన్ చేయకుండా, ముందుగా కుడి భుజానికి శస్త్ర చికిత్స నిర్వహించారు. శనివారం జరిగిన ఈ ఆపరేషన్ దాదాపు మూడున్నర గంటల పాటు కొనసాగినట్లు వైద్యులు వెల్లడించారు. మరో భుజానికి సంబంధించిన శస్త్ర చికిత్సను రెండు నెలల వ్యవధిలో నిర్వహించనున్నారు.

పదేళ్లుగా నొప్పిని భరిస్తూ...

2016లో పవన్ కళ్యాణ్‌కు భుజాలకు గాయాలయ్యాయి. అప్పట్లో వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినప్పటికీ, ప్రజా కార్యక్రమాలు మరియు రాజకీయ కార్యకలాపాల్లో ఆయన నిరంతరం పాల్గొన్నారు. ముఖ్యంగా 2018లో చేపట్టిన పోరాట యాత్ర సమయంలో అభిమానులు, పార్టీ శ్రేణులు ఆయనతో కరచాలనం చేయడానికి ఉత్సాహం చూపడంతో భుజాలపై ఒత్తిడి మరింత పెరిగింది.అలాగే 2019 ఎన్నికల అనంతరం రాయలసీమ జిల్లాల్లో పర్యటనలు, రైతుల సమస్యలపై నిర్వహించిన కార్యక్రమాలు, అనంతరం వారాహి యాత్రలు మరియు గత సార్వత్రిక ఎన్నికల ప్రచారాల్లో కూడా అభిమానుల సందడి కారణంగా గాయాలు మరింత తీవ్రమయ్యాయి. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ వాటిని పెద్దగా పట్టించుకోకుండా ప్రజల్లోనే కొనసాగారు.

వైద్యులకే ఆశ్చర్యం కలిగించిన గాయాలు

ఈ ఏడాది ఏప్రిల్‌లో ముక్కుకు శస్త్ర చికిత్స చేయించుకునే సమయంలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో రెండు భుజాల్లో తీవ్రమైన రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్‌తో పాటు కండరాల చీలికలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇంత తీవ్రమైన గాయాలతో కూడా పవన్ కళ్యాణ్ విధులు నిర్వర్తించడం వైద్యులను ఆశ్చర్యానికి గురి చేసింది.కొద్ది వారాల క్రితం ముంబయిలో నిర్వహించిన ప్రత్యేక వైద్య పరీక్షల అనంతరం శస్త్ర చికిత్సకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నట్లు సమాచారం.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)