యువతకు ఉద్యోగాల కల్పనే మా లక్ష్యం..
రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి పెట్టుబడులు తీసుకొస్తున్నాం..
యువత భవిత కోసం, వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తోంది..
సీఎం చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఇమేజ్ తో అమెరికా తర్వాత మొట్టమొదటిసారి విశాఖలో గూగుల్ సంస్థ అతిపెద్ద పెట్టుబడి పెట్టింది..
రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్
అనంతపురం, నవంబర్ 11 :అనంత జనశక్తి ప్రతినిధి
ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పెదఈర్లపాడు నుండి మంగళవారం 50 ఎంఎస్ఎంఈ పార్కుల ప్రారంభోత్సవాలు, శంఖు స్థాపనలు చేసే కార్యక్రమంలో వర్చువల్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.అనంతపురము నగరంలోని జెఎన్టీయూ మార్గంలో ఉన్న సిరికల్చర్ కార్యాలయంలోని ప్రాంగణంలో ఏపీఐఐసీకి సంబంధించి ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ కు శంఖుస్థాపన చేసే కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ పాల్గొనగా.. ముందుగా అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్, జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వెంకటశివుడు యాదవ్, తదితరులతో కలసి ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ కు సంబంధించిన శిలాఫలకాన్ని మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రకాశం జిల్లా కనిగిరి మండలం నుండి ఎంఎస్ఎంఈ పార్కుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ ప్రారంభోత్సవాలు చేపట్టామన్నారు. ప్రధానంగా యువత భవిత కోసం, వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈనెల 13, 14, 15వ తేదీలలో విశాఖపట్నంలో జరగబోయే సిఐఐ సమ్మేళనంలో దాదాపు 55 దేశాలకు సంబంధించిన వాణిజ్యం చూసేటటువంటి మంత్రులు వస్తున్నారని, ఆయా ఆ దేశాలకు సంబంధించిన వాణిజ్య బృందాలు, మనదేశంలోని అన్ని రాష్ట్రాలకు సంబంధించి పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడిదారులు వస్తున్నారన్నారు. దాదాపు 9 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి విశాఖపట్నంలో ఒప్పందాలు చేసుకోబోతున్నారన్నారు. పని చేసే ప్రభుత్వము వస్తే ఎంత మంచి మార్పు ఉంటుంది అనేది ఈ ప్రభుత్వాన్ని చూసి గమనించాలన్నారు. గత పాలకులు చేసిన పాపాల వల్ల మర్చిపోలేని భయం వెంటాడుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనే బ్రాండ్ ను చూసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారన్నారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం ద్వారా తమ భవిష్యత్తు కాదు తమ పిల్లల భవిష్యత్తుకు కూడా మంచి చేశారనే దానికి స్పష్టంగా కనిపించేలా ఈ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గూగుల్ లేని ప్రపంచాన్ని మనం ఊహించుకోలేమని, ఏ సమస్య గురించి అయినా గూగుల్ లో అడిగి తెలుసుకుంటున్నామని, విశ్వవ్యాప్తమైన గూగుల్ సంస్థ మొట్టమొదటిసారి అమెరికాను వదిలి అతి పెద్ద పెట్టుబడిని మన దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో పెట్టిందని, అది చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్ అన్నారు. మనకున్న అభివృద్ధి చెందిన దేశాలు, యూకే లాంటి దేశాలు పోటీపడ్డాయని, అయితే సీఎం బ్రాండ్ ఇమేజ్ తోనే విశాఖలో గూగుల్ ఏర్పాటయిందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త యుగం తయారవుతోందని, అందుకు ముందుగానే పిల్లలు తయారయ్యేలా సీఎం చంద్రబాబు గూగుల్ సంస్థ డేటా సెంటర్ పెట్టారన్నారు. ఒక విత్తనం వేస్తే మూడు తరాలకు సరిపడా పండ్లు కాస్తాయని, గూగుల్ సంస్థ రాష్ట్రంలో పడిన విత్తనమని, దాని ఫలితాలు మొదలయ్యాయని, గూగుల్ సంస్థ చుట్టూ దానికి అనుబంధంగా పనిచేస్తున్న కంపెనీలన్నీ కూడా మేము వస్తున్నామని సంప్రదింపులు రాష్ట్రంతో మొదలు పెట్టారన్నారు. గూగుల్ డేటా సెంటర్ ఒకటే కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించి ప్రపంచంలో ఒక మంచి కేంద్రంగా తయారు చేస్తున్నామని, వాటి చుట్టూ కంపెనీలు వచ్చే పరిస్థితి వస్తుందని, అది ఒక పెద్ద మర్రిచెట్టులా తయారయ్యే పరిస్థితి ఉంటుందన్నారు. 75 ఏళ్ల వయసులో సీఎం చంద్రబాబు రోజుకు 18 గంటలు పనిచేస్తున్నారని, ప్రజలు మనల్ని నమ్మి ఓట్లు వేశారని, అందుకు బాధ్యత తీసుకుని వారి నమ్మకాన్ని నిలబెట్టాలనే ఒక ఆలోచనతో ఈ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. రైతులకు ఈరోజు నీళ్లు ఇచ్చి న్యాయం చేయగలుగుతున్నామని, హంద్రీనీవా కాలువలో గత ప్రభుత్వం ఐదేళ్లలో ఒక గంప మట్టి తీయకపోతే.. తాము కేవలం 100 రోజుల్లో రెట్టింపు చేశామని, 6 పంపుల నుంచి 12 పంపులు నడిపే స్థాయికి తీసుకొచ్చామని, అది మన ప్రభుత్వ గొప్పదనం అన్నారు. హంద్రీనీవాని 40 టీఎంసీలు తీసుకువచ్చేందుకు డిజైన్ చేయడం జరిగిందని, ఇవాళ ఈ ఏడాది 50 టీఎంసీలు ఎందుకు తీసుకురాకూడదనేలా తాము పని చేస్తున్నామన్నారు. హంద్రీనీవా ద్వారా చెరువులను నింపుకునేలా తయారు చేస్తున్నామన్నారు. మరోవైపు పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకువస్తే ఎకానమీ పెరుగుతుందని, పరిశ్రమలు కట్టే టాక్స్ లు, జిఎస్టి, ఇన్కమ్ టాక్స్ లతో మనం రోడ్లు వేసుకోగలుగుతున్నామని, బ్రిడ్జిలు, కాలువలు కట్టుకోగలుగుతున్నామని, ఇవన్నీ నిరంతరం కొనసాగాలంటే పరిశ్రమలు, పెట్టుబడులు వస్తూనే ఉండాలన్నారు. అప్పుల పరిస్థితిలో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నామని, రేపు విశాఖపట్నంలో జరగబోయేది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక అద్భుతమైన ఘటన అన్నారు. ఐదేళ్లలో పరిశ్రమల వారు ఇటు వైపు తిరిగి చూసేందుకు భయపడ్డారని, ఇవాళ పారిశ్రామికవేత్తలను కార్పెట్ వేసి రండి అని పిలుస్తున్నామని, పరిశ్రమలు పెట్టండి, మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి అని చెబుతున్నామన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, మా లక్ష్యం పెట్టుబడులను ఆకర్షించి పరిశ్రమల స్థాపన, ఉద్యోగాలు ఇవ్వాలని లక్ష్యంతో తాము పని చేస్తున్నామన్నారు. యువతకు ఉద్యోగాల కల్పన, రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి పెట్టుబడులు తీసుకొస్తున్నామన్నారు. అందులో భాగంగానే ఈరోజు ప్రతి చోట పెట్టుబడులు పెట్టడం జరుగుతుందన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సత్యసాయి జిల్లాలో ఎక్కువ పరిశ్రమలు ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. పరిశ్రమలు తీసుకువచ్చేందుకోసం ప్రయత్నం చేస్తున్నామని, అందులో భాగంగానే పెద్ద ఎత్తున ఈ రోజు కార్యక్రమాలను చేపట్టామన్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో మరిన్ని మంచి పరిశ్రమలను జిల్లాకు తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తామన్నారు.అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సీఎం, మంత్రి లోకేష్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగు పరిచేలా ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నారన్నారు. రూ.16 కోట్ల నిధులతో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ను సిరికల్చర్ కార్యాలయంలోని ప్రాంగణంలో 4 ఎకరాల విస్తీర్ణంలో చేపడుతుండగా, దీని గురించి నిరుద్యోగ యువతీ యువకులకు తెలియజేయాలన్నారు. ఇందులో ఎక్కువ యువత పాల్గొని ప్రమోట్ చేయాలన్నారు. ఎంఎస్ఎంఈ పార్కులను ఉపయోగించుకోవాలని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలన్నారు.అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్ మాట్లాడుతూ ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకున్న వారికి.. ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సాహాకాలు అందిస్తోందన్నారు. విద్యుత్, నీరుతో పాటు ఇతర మౌళిక సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. వారు కేవలం మిషనరీస్ తీసుకొని వస్తే పరిశ్రమ ఏర్పాటుకు అన్ని రకాల సహకారం అందిస్తామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. 2047కల్లా ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లక్ష్యం అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కృషితో 16 నెలల్లో 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి 175 నియోజకవర్గంలలో ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేసి ప్రతి ఇంట్లోను పారిశ్రామికవేత్తలను తయారు చేయాలని చూస్తున్నారన్నారు. అనంతపురంలో ఉత్పత్తి చేసే విధంగా రూ.16 కోట్ల నిధులతో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేస్తున్నారన్నారు. నిన్న రాష్ట్ర క్యాబినెట్ లో లక్ష కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారని, ఇప్పటికే అనంతపురం జిల్లాలో ఆటోమొబైల్ హబ్ గా మారుస్తున్నారన్నారు. సోలార్, విండ్, డిఫెన్స్ పరిశ్రమలు అనంతపురంలో ఏర్పాటు కాబోతున్నాయన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ మాట్లాడుతూ వైజాగ్ లో జరగబోయే సిఐఐ సదస్సుకు ముందుగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 3 చోట్ల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరుపుకుంటున్నామన్నారు. అందులో ఏపీఐఐసీకి సంబంధించి ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ను నగరంలోని సిరికల్చర్ కార్యాలయంలోని ప్రాంగణంలో 4 ఎకరాల విస్తీర్ణంలో చేపడుతుండగా, ఇందుకు రూ.16 కోట్ల నిధులు మంజూరయ్యాయని, దీనికి శంకుస్థాపన కార్యక్రమం మంత్రి చేతుల మీదుగా చేయడం జరిగిందని, అదేవిధంగా రాప్తాడు నియోజకవర్గంలోని గాయత్రీ మిల్క్ డైరీ, కళ్యాణదుర్గంలో Ecoren కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధించిన దేశ్రాజ్ సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, ఓ2 పవర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ లకు శంఖుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లాలో నాలుగు కంపెనీలు మూడు చోట్ల నిర్వహించిన కార్యక్రమాల్లో మంత్రివర్యులు పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యేలు పాల్గొనడం జరిగిందని, జిల్లాలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు సహకారం అందిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ 24వ వార్డు కార్పొరేటర్ రామాంజనేయులు, బెస్త కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ పవన్, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ రంగాచారి, ఆర్డీఓ కేశవనాయుడు, ఏపిఐఐసి జోనల్ మేనేజర్ నాగ కుమార్, మేనేజర్లు సాయిసాగర్, శివ మోహన్ కృష్ణ, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ మెంబర్ నరసింహులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గన్నారు