ఢిల్లీలో జీఎంఆర్ సంస్థ సీనియర్ అధికారులతో మంత్రి నారా లోకేష్ భేటీ
విశాఖలో ఏవియేషన్ ఎడ్యుసిటీ అభివృద్ధికి రూపురేఖలు
న్యూఢిల్లీ డిసెంబర్ 02 అనంత జనశక్తి న్యూస్
ఆంధ్రప్రదేశ్‌లో తొలి ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ నిర్మాణానికి వేగం పెరిగింది. విమానాశ్రయాల రూపకల్పన, నిర్మాణం, నిర్వహణలో పేరుగాంచిన జీఎంఆర్ గ్రూప్‌కు చెందిన సీనియర్ అధికారులతో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో సమావేశమయ్యారు.విశాఖపట్నం సమీపంలో ప్రతిపాదిత ఏవియేషన్ ఎడ్యుసిటీపై సమగ్ర చర్చలు జరిపిన ఈ సమావేశంలో మొత్తం అభివృద్ధి ప్రణాళికను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ భాగస్వామ్యంతో ఎడ్యుసిటీని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.
ఏవియేషన్–అంతరిక్ష–రక్షణ రంగాలకు హబ్
విశాఖలో అభివృద్ధి కానున్న ఈ ఎడ్యుసిటీ ద్వారా విమానయాన, స్పేస్, డిఫెన్స్ రంగాల విద్య–శిక్షణలకు ప్రత్యేక కేంద్రంగా అవతరించనుంది. ఇందుకోసం ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన అంతర్జాతీయ విద్యాసంస్థలను తీసుకురావడంపై కూడా చర్చ జరిగింది.ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటే ఉత్తరాంధ్ర అభివృద్ధికి గేమ్‌చేంజర్ కాకుండా, రాష్ట్రంలో ఏవియేషన్ క్లస్టర్ అభివృద్ధి వేగవంతం అవుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు.ఈ సమావేశంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, జీఎంఆర్ సంస్థ సీనియర్ అధికారులు ఎస్జీకే కిషోర్, సి. ప్రసన్న, పీయుష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.