తిరుమల పర్యటనలో కేంద్ర మంత్రి చౌహన్ తో మంత్రి అచ్చెన్నాయుడు భేటీ
- వ్యవసాయ అభివృద్ధి, రైతుల సంక్షేమంపై సమగ్ర చర్చలు
- మైక్రో ఇరిగేషన్ నిధుల విడుదలపై విజ్ఞప్తి చేసిన మంత్రి అచ్చెన్న
- సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్
తిరుమల,ఫిబ్రవరి 22:అనంత జనశక్తి న్యూస్
కేంద్ర వ్యవసాయం & రైతుల సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం ఉదయం తిరుమలను సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పలు ముఖ్యాంశాలపై చర్చించారు. రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి, రైతుల సంక్షేమ కార్యక్రమాల అమలు, కేంద్ర పథకాల సమర్థవంతమైన అమలు వంటి అంశాలపై ఇరు మంత్రులు విస్తృతంగా అభిప్రాయాలు పంచుకున్నారు. రాష్ట్రంలో రైతులకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం, నిధులు మరియు వివిధ పథకాల అమలుపై మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. రైతుల ఆదాయవృద్ధి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, సాగు ఖర్చుల తగ్గింపు దిశగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతోందని కొనియాడారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సమన్వయంతో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని ఇరు మంత్రులు ఆకాంక్షించారు. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న మైక్రో ఇరిగేషన్ పథకానికి సంబంధించిన కేంద్ర వాటా నిధుల విడుదల అంశాన్ని మంత్రి అచ్చెన్నాయుడు ప్రస్తావించారు. రాష్ట్రంలో ఇప్పటికే అమలు చేసిన పథకాల కింద కేంద్ర వాటాగా మొత్తం ₹695 కోట్లు రావలసి ఉందని తెలిపారు. ఈ నెలలో కేవలం ₹50 కోట్లు మాత్రమే విడుదలయ్యాయని, ఇంకా ₹645 కోట్లు విడుదల చేయాల్సి ఉందని వివరించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మిగిలిన కేంద్ర వాటా నిధులను తక్షణమే విడుదల చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కనీసం మరో ₹400 కోట్లు సెంట్రల్ షేర్ నిధులు విడుదల చేయవలసిందిగా కోరారు. ఈ నిధులను RKVY–PDMC పథకం ద్వారా మంజూరు చేయాలని మంత్రి అచ్చెన్న కోరారు. మైక్రో ఇరిగేషన్ విస్తరణ ద్వారా నీటి వనరుల సమర్థ వినియోగం, సాగు వ్యయాల తగ్గింపు, రైతుల ఆదాయవృద్ధి సాధ్యమవుతాయని మంత్రి పేర్కొన్నారు. ఈ విషయాలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు, త్వరితగతిన నిధుల విడుదలకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.