వైద్యం వ్యాపారమైతే… మానవత్వం బలేనా?
క్లినికల్ ట్రయల్స్ ముసుగులో విస్తరిస్తున్న మెడికల్ మాఫియా
వైద్యంపై ప్రత్యేక కథనం
వైద్యం వ్యాపారం కాదు. అది మానవ జీవనానికి భరోసా. కానీ నేడు అదే వైద్యం లాభాల కోసం ప్రాణాలతో చెలగాటమాడుతున్నదన్న ఆరోపణలు సమాజాన్ని కలచివేస్తున్నాయి. వైద్య నైతికతకు విరుద్ధంగా జరుగుతున్న అక్రమ క్లినికల్ ట్రయల్స్, వైద్య వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని క్రమంగా చిదిమేస్తున్నాయి.ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఉన్నప్పటికీ, భారతదేశం క్లినికల్ ట్రయల్స్‌కు అనుకూల కేంద్రంగా మారుతున్నదన్న ఆందోళన తీవ్రంగా వ్యక్తమవుతోంది. తక్కువ ఖర్చు, అధిక పేద జనాభా, అవగాహన లోపం—ఈ మూడింటినీ ఆసరాగా చేసుకొని మెడికల్ మాఫియా అక్రమ ప్రయోగాలకు పాల్పడుతోందన్న ఆరోపణలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో జరిగిన ఘటనలు, ఈ ప్రమాదం మన చుట్టూనే ఉందన్న చేదు నిజాన్ని గుర్తు చేస్తున్నాయి.నిబంధనల ప్రకారం ఏ ఔషధమైనా ముందుగా జంతువులపై ప్రయోగించి, ఆపై కఠిన నైతిక ప్రమాణాలతో, పూర్తి సమాచారం ఇచ్చి, బాధితుడి స్పష్టమైన అంగీకారంతోనే మనుషులపై ప్రయోగించాలి. కానీ వాస్తవంలో వైద్య శిబిరాలు, ఉచిత చికిత్సలు, ఆర్థిక సహాయం పేరుతో పేదలు, అమాయకులను టార్గెట్ చేసి నేరుగా మనుషులపైనే ఔషధ ప్రయోగాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు భయానకంగా మారుతున్నాయి.కరీంనగర్‌లో గతంలో కొందరు యువకులు ఔషధ ప్రయోగాల్లో పాల్గొని తీవ్ర అస్వస్థతకు గురవ్వడం, ఒకరు మతిస్థిమితం కోల్పోయినట్లు ఫిర్యాదు రావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. తాజాగా మరో బాధితుడు పోలీసులను ఆశ్రయించడం, ఇలాంటి ఘటనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయన్న అనుమానాలను బలపరుస్తోంది. వెలుగులోకి రాని కేసులు మరెన్నో ఉన్నాయన్నది ఆందోళన కలిగించే అంశం.ఈ సమస్య కొత్తది కాదు. 2006లో లండన్‌లో జరిగిన డ్రగ్ ట్రయల్‌లో ఆరోగ్యవంతులైన ఆరుగురు వాలంటీర్లు తీవ్ర శారీరక వైకల్యాలకు గురయ్యారు. 2016లో ఫ్రాన్స్‌లో జరిగిన న్యూరో డ్రగ్ ట్రయల్‌లో ఒకరు మృతి చెందగా, మిగిలినవారు జీవితాంతం మెదడు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఇవి నైతికత లేని ప్రయోగాల ప్రమాదాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన ఉదాహరణలు.భారతదేశంలో పరిస్థితి మరింత కలవరపెడుతోంది. సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ గణాంకాల ప్రకారం, 2021 నుంచి 2025 జులై వరకు దేశవ్యాప్తంగా 1,705 మంది క్లినికల్ ట్రయల్స్‌లో మరణించారు. వేలాది మంది తీవ్ర దుష్ప్రభావాలకు గురయ్యారు. అయినప్పటికీ బాధితుల్లో చాలా మందికి పరిహారం అందకపోవడం వ్యవస్థ వైఫల్యాన్ని ప్రశ్నిస్తోంది.2010లో గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వేలాది బాలికలపై హెచ్పీవీ వ్యాక్సిన్ ట్రయల్స్ జరగడం, వాటిలో మరణాలు సంభవించడం అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. తల్లిదండ్రుల సమ్మతి లేకుండా, నైతిక నియమాలు ఉల్లంఘించారన్న ఆరోపణలు ఇప్పటికీ మిగిలిపోయిన గాయాల్లాంటివే.అక్రమ క్లినికల్ ట్రయల్స్ ప్రాణనష్టం, వైకల్యాలతోనే ఆగిపోవడం లేదు. ఇవి ప్రజల్లో వైద్య వ్యవస్థపై భయాన్ని, అనుమానాన్ని పెంచుతున్నాయి. చివరికి ఇది ప్రజారోగ్య వ్యవస్థ మొత్తానికే ముప్పుగా మారే ప్రమాదం ఉంది.సరికొత్త ఔషధాలు, చికిత్సలు మానవాళికి అవసరం. కానీ వాటి కోసం చేసే ప్రయోగాలు మానవ హక్కులు, వైద్య నైతికత పరిధిలోనే జరగాలి. అమాయకుల ప్రాణాలను పణంగా పెట్టి సంపాదించే లాభాల కంటే మానవత్వం, భద్రతకే అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలి. అక్రమాలకు పాల్పడే మెడికల్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవడం, క్లినికల్ ట్రయల్స్‌పై పర్యవేక్షణను మరింత పటిష్టం చేయడం ప్రభుత్వాలు, నియంత్రణ సంస్థల తక్షణ బాధ్యత. లేదంటే వైద్యం అనే పవిత్ర రంగం ప్రజల దృష్టిలో భయానికి, అనమ్మకానికి ప్రతీకగా మారే ప్రమాదం తప్పదు.