ఫిట్ ఇండియా సైక్లోథాన్‌లో కలెక్టర్
ఐదు కిలోమీటర్ల సైకిల్ సవారీతో యువతకు స్ఫూర్తి దాయకంగా నిలిచిన చదలవాడ నాగరాణి
అధికారులు, పోలీసులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్న ఆరోగ్య కార్యక్రమం
భీమవరం, నవంబర్ 8:అనంత జనశక్తి న్యూస్
దేశవ్యాప్తంగా జరుగుతున్న ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా భీమవరం విష్ణు కాలేజీలో శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి “ఫిట్ ఇండియా – సైక్లోథాన్” సైకిల్ ర్యాలీకి ఫ్లాగ్‌ఆఫ్ చేసి ప్రారంభించారు. ఈ ర్యాలీ విష్ణు కాలేజీ నుంచి జువ్వలపాలెం అల్లూరి సీతారామ రాజు విగ్రహం వరకు ఐదు కిలోమీటర్ల దూరం సాగింది. కేవలం జండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించడమే కాక, ర్యాలీ కి ముందు ఉండి మార్గనిర్దేశకత్వం వహించటం ద్వారా కలెక్టర్ నాగరాణి ప్రత్యేకతను ఆపాదించుకున్నారు. పూర్తి నిడివి 5 కిలోమీటర్లు సైకిల్ తొక్కి నేటి యువతకు ఆదర్శంగా నిలిచారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మీ, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, ఇతర అధికారులు కూడా సైక్లింగ్‌లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ శారీరక దృఢత్వం కోసం ప్రతిరోజూ కొంత సమయం నడక, సైక్లింగ్ , యోగాకు కేటాయించాలన్నారు. “ఆరోగ్యమే మహాభాగ్య మన్న నాగరాణి దినచర్యలో వ్యాయామాన్ని భాగం చేసుకోవాలని సూచించారు. అధికారులు, సిబ్బందికి ఒత్తిడి తగ్గించేందుకు ప్రతి నెల ఒకసారి వాక్, 2కే రన్, యోగా, సైక్లింగ్ వంటి కార్యక్రమాలు నిర్వహించే ఆలోచనలో ఉన్నామని తెలిపారు.పోలీస్ శాఖ ప్రతి నెలా ఇలాంటి ఫిట్‌నెస్ కార్యక్రమాలు నిర్వహించడం మంచి విషయం అని ప్రశంసించారు. ఇవి మనసు, శరీరానికి ఉల్లాసం ఇస్తాయి. ఆరోగ్య జీవనశైలికి ప్రేరణ కలిగిస్తాయని చెప్పారు.జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మీ మాట్లాడుతూ, కలెక్టర్ మార్గదర్శకత్వంలో ప్రతి నెలా ఒక ఫిట్‌నెస్ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. ఇలాంటి చర్యలు ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా ప్రజల్లో ఫిట్‌నెస్‌పై అవగాహన పెంచుతాయన్నారు.ఈ కార్యక్రమంలో డీఆర్ఓ బి. శివనారాయణరెడ్డి, ఆర్డీవో కె. ప్రవీణ్‌కుమారరెడ్డి, మున్సిపల్ కమిషనర్ కె. రామచంద్రరెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ ఏ. రాంబాబు, డీఈఓ ఇ. నారాయణ, డీపీఓ ఎం. రామనాథరెడ్డి, భీమవరం, నరసాపురం డీఎస్పీలు, ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, తహసీల్దార్ రవి రాంబాబు, పోలీసు, రెవెన్యూ సిబ్బంది, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.