‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించిన కూటమి సర్కార్
- నేటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం
- మంగళగిరిలో పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేశ్
- దివ్యాంగులతో కలిసి పల్లె వెలుగు బస్సులో ప్రయాణం
- పథకం ద్వారా 12.76 లక్షల మందికి లబ్ధి
విజయవాడ మార్చి 18 అనంత జనశక్తి న్యూస్
ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే దివ్యాంగ శక్తి పథకాన్ని కూటమి ప్రభుత్వం బుధవారం ప్రారంభించింది. గుంటూరు జిల్లా మంగళగిరి బస్టాండ్లో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తో కలిసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు 100 శాతం అంధత్వం ఉన్నవారికి, చెవిటి, మూగతోపాటు మరుగుజ్జులకు మాత్రమే ఉచిత ప్రయాణ సౌకర్యం ఉండగా, నేటి నుంచి 21 కేటగిరీల దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం వర్తించనుంది. ఉగాది పండుగ సందర్భంగా దివ్యాంగులకు ప్రభుత్వం ఇచ్చిన ఈ కానుకతో సుమారు 12.76 లక్షల మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందనున్నారు.
పల్లె వెలుగులో దివ్యాంగులతో ప్రయాణం
“దివ్యాంగ శక్తి” పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేశ్ గారు దివ్యాంగులతో కలిసి పల్లె వెలుగు బస్సులో ప్రయాణించారు. మంగళగిరి బస్టాండ్ నుంచి పెనుమాక వరకు సుమారు 11 కిలోమీటర్ల మేర ప్రయాణించారు. మంగళగిరి అంబేద్కర్ సెంటర్ లో మొదలైన ప్రయాణం... డాన్ బాస్కో స్కూల్, డోలాస్ నగర్, ప్రకాశ్ నగర్, నులకపేట, ఉండవల్లి సెంటర్ మీదుగా పెనుమాక వరకు సాగింది. ఈ సందర్భంగా దివ్యాంగుల బాగోగులు, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రభుత్వం తరుఫున అందుతున్న సంక్షేమ పథకాలపై నేతలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
• పూల వర్షమై కురిసిన అభిమానం
మంగళగిరిలో దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు, కూటమి పార్టీల కార్యకర్తలు, నాయకులు, లబ్ధిదారులు తరలి వచ్చారు. మంగళగిరి నుంచి పెనుమాక వరకు దారి పొడవునా పూల వర్షం కురిపిస్తూ అభిమానం చాటుకున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేసుకుంటూ నేతలు ముందుకు సాగారు.