రాజకీయాలకతీతంగా!..
పేదల సొంతింటి కల నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం!!...
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ
ఇంటి నిర్మాణానికి రూ.2.50 లక్షల ఆర్థిక సాయం
సొంత స్థలం ఉన్నవారు ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోండి : మంత్రి
పుట్టపర్తి నవంబరు 12 , అనంత జనశక్తి న్యూస్
రాజకీయాలకతీతంగా, కక్షసాధింపులకు తావులేకుండా పేదల సొంతింటి కల నెరవేర్చడమే తమ ప్రభుత్వం బాధ్యతని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు.బుధవారం పుట్టపర్తి నియోజకవర్గం పెడపల్లి గ్రామంలో... రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల మందికి ఇళ్లను నిర్మించి... ఇంటి తాళాలను నేడు లబ్ధిదారులకు అందించే కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నమయ్య జిల్లాలో శ్రీకారం చుట్టగా... ఈ పథకంలో భాగంగా నేడు పుట్టపర్తి నియోజకవర్గం పెడపల్లి గ్రామంలో PMAY (U) 2.0 ద్వారా ఇళ్ళు మంజూరు అయిన లబ్దిదారుల సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు ఇంటి పత్రాలను, తాళాలను రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖల మంత్రి వర్యులు శ్రీమతి సవితమ్మ అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు పాల్గొన్న కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి తదితరులు కూడా లబ్ధిదారులకు ఇంటి పత్రాలను అందజేశారు. అలాగే పిఎంఏవై (అర్బన్)లో భాగంగా 2024- 25 అర్హులైన లబ్ధిదారుల ఇండ్లకు భూమి పూజ కూడా చేయడం జరిగింది.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రివర్యులు సవితమ్మ మాట్లాడుతూ... ఎన్నికల హామీల్లో భాగంగా మరో హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చుతోందన్నారు. అందరికీ అవాసం పథకంలో భాగంగా రాష్ట్రంలోని సొంత ఇళ్లు లేని పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తామని ఎకల్లో హామీ ఇచ్చిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఆ హామీని నిలబెట్టుకుంటూ... పేదల సొంతింటి కలను నెరవేర్చుతున్నామన్నారు.భగవాన్ శ్రీ సత్య సాయి బాబా శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి, మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసి ఉత్సవాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ప్రత్యేకంగా పరిశీలించి ఎక్కడ ఎలాంటి లోటుపాటులు లేకుండా పూర్తి చేయాలని ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఈ వేదిక ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి మరొక నిదర్శనంగా రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల పండగ చేసాం. సూపర్ సిక్స్ హామీలలో భాగంగా... పింఛన్ల పండగ చేశాం. దీపం 2 పథకం కింద ఉచిత సిలిండర్లు ఇచ్చాం. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చాం. మహిళా పక్షపాతి అయిన ముఖ్యమంత్రి స్త్రీ శక్తి పథకం ద్వారా.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు. ఉచిత ఇసుక ఎక్సైజ్ పాలసీ కూడా తీసుకువచ్చాం. ఉపాధి హామీ ద్వారా సిసి రోడ్లు డ్రైనేజీలు నిర్మించాం. పాట్ హోల్ ద్వారా రోడ్లపై గుంతలు పూడ్చి వేసాం. జాతీయ రహదారుల పనులు ఇరిగేషన్ పనులు మొదలయ్యాయి. ఈ ప్రాంతానికి సాగునీరు, త్రాగునీరు, పరిశ్రమలు తెచ్చింది, కియా పరిశ్రమ తెచ్చి ఉపాధి కల్పించింది చంద్రబాబు నాయుడు. నిన్నటి రోజున రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల పండుగ జరిగింది.. ప్రతి నియోజకవర్గంలో ఎం ఎస్ ఎం ఈ పార్కులు ఉండాలని, ప్రతి కుటుంబంలో ఒకరిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని ముఖ్యమంత్రి లక్ష్యమని పేర్కొన్నారు. 2014- 19లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన వ్యక్తిగత, టిడ్కో ఇళ్లను గతంలో గాలికి వదిలేశారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల గృహప్రవేశాల పండుగ జరుగుతోంది. అధికారంలోకి వచ్చిన 17 నెలల్లో ఇళ్లు పూర్తి చేసి లబ్దిదారులకు అప్పగిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు.రాజకీయాలకు అతీతంగా ఎస్సీలకు ఎస్టీలకు రూ 75వేల, బీసీలకు రూ.50వేలు అదనంగా ఇచ్చి ఇల్లు పూర్తి చేసిన ఘనత మన ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఉన్నతమైన విద్య, అన్ని సౌకర్యాలు కల్పించాలని మంచి సంకల్పంతో 17 మెడికల్ కాలేజీ లను అభివృద్ధి చేయడం జరుగుతోంది. దీనిపై కొంతమంది అనవసరంగా రాద్ధాంతం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వివరించారు. పుట్టపర్తి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పథకాలకు నిధులు తేవడంలో, పనులను అమలు చేయడానికి, స్థానిక శాసనసభ్యురాలు మరియు మాజీ మంత్రివర్యులు చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు.కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ శ్యాం ప్రసాద్ మాట్లాడుతూ... అందరికీ ఇండ్లు పథకంలో భాగంగా ఇల్లు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కుటుంబంలోని వారందరూ ఆనందోత్సాహాలతో, ఆయురారోగ్యాలతో జీవితంలో ఇంకా మంచిగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో కొత్తగా ఇండ్లు పూర్తి చేసుకున్న 8086 మందికి లబ్ధిదారులకు ఆయా నియోజకవర్గాలలో గృహప్రవేశాలు ఇంటి తాళాలు అందజేసే కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని చెప్పారు. అదేవిధంగా అర్హులైన ప్రతి నిరుపేదకు ఇల్లు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పిఎంఏవై అర్బన్ 2.0లో భాగంగా రూ.2.50 లక్షలను ప్రభుత్వం మంజూరు చేస్తోంది. దీనిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇంకను అర్హులైన లబ్దిదారులు ఎవరైనా ఉంటే PMAY (Gramina) ఆవాస్ ప్లస్ 2024 యాప్ నందు దరఖాస్ చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ... నియోజకవర్గంలో ఇండ్లు మంజూరు అయిన ప్రతి ఒక్కరు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలను అందిపుచ్చుకొని ఇంటి నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసుకోవాలని అన్నారు. అర్హులైన ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇంటిని నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని.. ఆ దిశగా అధికారులు కూడా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి , జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి కె.వెంకటనారాయణ, వివిధ శాఖల అధికారులు, స్థానిక నాయకులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.