ఐదేళ్లు అడ్డగోలుగా ప్రజల కష్టాన్ని దోచేసి.. నేడు వీధిపోరాటాలా? : ప్రత్తిపాటి
ఆస్తిపన్ను..నీటిపన్ను..చెత్తపన్ను.. వ్యాట్ పేరుతో పెట్రోల్, డీజిల్ పై భారం.. 9సార్లు విద్యుత్ ఛార్జీల మోతతో ప్రజలకు చుక్కలు చూపించింది వైసీపీ ప్రభుత్వం కాదా?
దేశంలో ఏపీలోనే పెట్రోల్ , డీజిల్ ధరలు అధికమని 2020లో పార్లమెంట్ సాక్షిగా కేంద్రం ప్రకటించినప్పుడు జగన్ కు ప్రజల బాధలు గుర్తురాలేదా? : ప్రత్తిపాటి
గుంటూరు మే 18 అనంత జనశక్తి న్యూస్
“మతిలేని రాజకీయాలతో వైసీపీ ప్రజల్లో మరింత పలచనవుతోంది. అధికారంలో ఉన్నప్పుడు బాదుడే బాదుడు సిద్ధాంతాన్ని క్రమం తప్పకుండా ఆచరించి, ప్రజలకు రోజూ పట్టపగలే చుక్కలు చూపించిన ఘనకీర్తి వైసీపీ ప్రభుత్వానికే దక్కింది. ఆస్తిపన్ను, చెత్తపన్ను, రిజిస్ట్రేషన్ ఫీజులు, ఆర్టీసీ, నీటి వినియోగ ఛార్జీల పెంపు సహా, 9 సార్లు విద్యుత్ ఛార్జీల పెంచి ప్రజల కష్టాన్ని పాయసంలా దిగమింగినవారు..నేడు ఇంధన ధరలపై వీధిపోరాటాలు చేయడం విడ్డూరంగా ఉంది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావమే ఇంధన సంక్షోభానికి కారణమని వైసీపీకి తెలియదా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయంతో సంబంధం లేకుండా, భారత్ తో పాటు, అనేక దేశాలు యుద్ధ ప్రభావంతో ఇబ్బందులు పడుతున్నది నిజం కాదా? 2019-24లో పన్నులు, ధరల పెంపుతో ప్రజల్ని పీడించిన వైసీపీ ప్రభుత్వం.. రాజకీయ నిరసనలు చేయడం హాస్యాస్పదం.
పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ భారం మోపినప్పుడు జగన్ కు ప్రజలు గుర్తురాలేదా?
దేశంలో ఏపీలోనే పెట్రోల్ , డీజిల్ ధరలు అధికమని 2020లో పార్లమెంట్ సాక్షిగా కేంద్రం ప్రకటించినప్పుడు జగన్ కు ప్రజలు, వారి కష్టాలు గుర్తురాలేదా? పెట్రోల్.. డీజిల్ పై అధిక వ్యాట్, రోడ్ల అభివృద్ధి సెస్సుతో ప్రజల జేబులకు చిల్లు పెట్టిన ఘనత జగన్ సర్కార్ దే. వైసీపీ ప్రభుత్వం వ్యాట్ రూపంలో ఏటా రూ.900 కోట్ల నుంచి రూ.1000 కోట్ల వరకు ప్రజల ముక్కుపిండి వసూలు చేసింది. నాడు అడ్డగోలుగా ప్రజల కష్టం దోచేసిన వైసీపీ నేతలు... నేడు నిస్సిగ్గుగా రాజకీయలబ్ధికోసం వెంపర్లాడుతున్నారు. జగన్ అనాలోచిత అహంకారపూరిత నిర్ణయాలతో ఐదేళ్లు ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. ఇసుక, మద్యం కుంభకోణం, ప్రకృతి వనరుల దోపిడీ, కృత్రిమ భూ సమస్యల సృష్టితో సామాన్య, మధ్య తరగతి వర్గాల జీవితాల్ని జగన్ పూర్తిగా రోడ్డున పడేశాడు.కూటమిప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల మేలే కోరుతుంది అనడానికి విద్యుత్ ఛార్జీల ట్రూ డ్రౌనే నిదర్శనం. యూనిట్ కు 13 పైసల తగ్గింపు ప్రయోజనాల్ని నేరుగా ప్రజలకు అందించి, తమది ప్రజా ప్రభుత్వమని నిరూపించింది. జగన్ విద్యుత్ సంస్థలపై మోపిన రూ.4,500 కోట్ల ట్రూ అప్ భారాన్ని చంద్రబాబు ప్రభుత్వం భరిస్తోంది. జగన్ చేసిన లక్షల కోట్ల అప్పులు భారం ప్రజలపై పడకుండా, సంక్షేమ.. అభివృద్ధి ఫలాలు ప్రజలకు పంచుతోంది.” అని ప్రత్తిపాటి సోమవారం ఒక ప్రకటనలో స్పష్టంచేశారు.