గుండె శస్త్రచికిత్సల్లో సరికొత్త విప్లవం
* కిమ్స్ సవీరా ఆస్పత్రిలో కీహోల్ గుండె శస్త్రచికిత్సలు
* రెండు నెలల్లో ఈ పద్ధతిలో 25 శస్త్రచికిత్సలు పూర్తి
* ఆరోగ్యశ్రీ పథకంలో ఉచితంగానే ఆపరేషన్లు
అనంతపురం, మే 22, 2023: గుప్పెడంత గుండెకు ఏ చిన్న సమస్య వచ్చినా తట్టుకోలేము. రక్తనాళాలు పూడుకుపోవడం, వాల్వులు పాడవ్వడం లాంటి సమస్యలు ఏవైనా వస్తే దానికి గుండె శస్త్రచికిత్సలు చేస్తారు. సాధారణంగా అయితే వీటికోసం ఛాతి ఎముకను కత్తిరించి, గుండెవరకు వెళ్లి అప్పుడు ఆపరేషన్ చేస్తుంటారు. కానీ అత్యాధునిక పరిజ్ఞానం, వైద్యంలో నైపుణ్యం తోడైతే వీటిని కూడా మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతిలో (కీహోల్) చేయొచ్చని నిరూపిస్తున్నారు.. అనంతపురంలోని కిమ్స్ సవీరా ఆస్పత్రి వైద్యులు. గతంలో రాయలసీమ వాసులు ఈ తరహా శస్త్రచికిత్సలు చేయించుకోవాలంటే హైదరాబాద్ లేదా బెంగళూరు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు రాయలసీమ మొత్తానికి కేవలం కిమ్స్ సవీరా ఆస్పత్రిలో మాత్రమే కీహోల్ పద్ధతిలో.. అంటే కేవలం అతి తక్కువ కోతతో పెట్టి దాని ద్వారానే గుండెకు బైపాస్, లేదా వాల్వుల మార్పిడి లాంటి కొన్ని శస్త్రచికిత్సలను చేస్తున్నట్లు ఈ ఆస్పత్రికి చెందిన సీనియర్ కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్, వాస్క్యులర్ సర్జన్ డాక్టర్ కె.సందీప్ రెడ్డి తెలిపారు. గడిచిన రెండు నెలల నుంచి ఈ తరహా ఆపరేషన్లు చేస్తుండగా, కేవలం ఈ 60 రోజుల్లోనే 25కు పైగా ఈ పద్ధతిలో చేసినట్లు ఆయన తెలిపారు.
ప్రయోజనాలు ఇవీ..
సాధారణంగా గుండెకు శస్త్రచికిత్స చేయలంటే ఛాతి ఎముకలను కత్తిరిస్తారు. తర్వాత మళ్లీ వాటిని అతికిస్తారు. దానివల్ల శస్త్రచికిత్స తర్వాత కోలుకోవడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది, నొప్పి ఎక్కువగా ఉంటుంది, ఆపరేషన్ సమయంలో రక్తం ఎక్కువగా పోయే అవకాశం ఉంటుంది, ఇన్ఫెక్షన్లు కూడా వ్యాపించొచ్చు. వీటిన్నింటికీ తోడు.. ఎద మీద పెద్ద మచ్చ ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. ఇది చిన్నపిల్లలు, మహిళలకు ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అదే మినిమల్లీ ఇన్వేజివ్ లేదా కీహోల్ పద్ధతిలో అయితే కేవలం అతి తక్కువ కోతతో దానిగుండానే అత్యాధునిక వైద్య పరికరాలను లోపలకు పంపి, వాటితోనే శస్త్రచికిత్సను పూర్తిచేయగలరు. అలా చేయడానికి అత్యున్నత స్థాయి నైపుణ్యం, అందుకు తగిన పరికరాలు ఉండాలి. కిమ్స్ సవీరా ఆస్పత్రిలో ఈ తరహా పరికరాలు ఉండటంతో పాటు ఇలాంటి శస్త్రచికిత్సలు చేయడంలో ప్రత్యేక శిక్షణ పొందిన డాక్టర్ సందీప్ రెడ్డి, ఆయన బృందం ఉండటం రాయలసీమ వాసులకు వరంగా మారింది. కీహోల్ శస్త్రచికిత్స వల్ల రోగి చాలా త్వరగా కోలుకుంటారు, రక్తస్రావం ఎక్కువగా ఉండదు, ఇన్ఫెక్షన్లు వ్యాపించవు, నొప్పి తక్కువగా ఉంటుంది, తిరిగి పనిలోకి త్వరగా వెళ్లొచ్చు, పైపెచ్చు ఎద భాగంలో ఎలాంటి మచ్చలు కనిపించవు.
అంతా ఉచితంగానే…
ఆరోగ్యశ్రీ పథకంలో కూడా ఈ శస్త్రచికిత్సలు ఉండటంతో దాదాపు వీటన్నింటినీ ఆ పథకంలోనే ఉచితంగా అందిస్తున్నట్లు డాక్టర్ కె.సందీప్ రెడ్డి తెలిపారు. అందువల్ల ఇదేదో అత్యాధునిక శస్త్రచికిత్స కాబట్టి, తమకు అందుబాటులో ఉండదన్న అపోహలు అక్కర్లేదని, ఎవరైనా కూడా వీటిని ఆరోగ్యశ్రీ పథకంలో పూర్తి ఉచితంగా చేయించుకోవచ్ని ఆయన వివరించారు.